Hyderabad Student Akarshana Interview: హైదరాబాద్‌కు చెందిన ఆకర్షణ 7వ తరగతి చదువుతుంది. పుస్తక పఠనంపై ఆసక్తితో చదువుల్లో రాణించింది. ఇతరులను సైతం చదివించాలని ప్రయత్నాలు చేసింది. ఇలా క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు పుస్తకాలు అందించి విద్యావైపు ప్రోత్సాహించాలని అనుకుంది. అందులో భాగంగా ఎమ్ఎన్జి క్యాన్సర్ ఆసుపత్రితోపాటు..పలు ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి..పెద్ద మనసు చాటుకుంది. తను చేస్తున్న సేవలకుగాను..ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. గతంలో రాష్ట్రపతి నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఆకర్షణ త్వరలో ప్రధాని మోదీని కలవనుంది.
స్వయంగా భారత ప్రధాని మిమ్మల్ని కలువనుండడం చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు జరగనుంది...? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ?
నాకు ఇప్పటికీ ప్రధానిని ఏరోజు కలుస్తానో తెలియదు. కానీ, బహుశా అక్టోబర్ మొదటి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నా గురించి మన్‌కీ బాత్ కార్యక్రమంలో చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. నా కల నిజమైన అనుభూతి కలిగింది. చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రధాని నా లైబ్రరీ ఇన్షియేటివ్ గురించి మాట్లాడడం ద్వారా నేను నా కుటుంబం చాలా గర్వపడ్డాము.
మన్‌కీబాత్‌లో ప్రధాని మీ గురించి మాట్లాడే కంటే ముందు రోజు సరిగ్గా ఏం జరిగింది?
జ: గత శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మా నాన్నకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. రేపు దూరదర్శన్ రిపోర్టర్లు విజువల్స్ బైట్స్ తీసుకోవడానికి మీ ఇంటికి వస్తారు. మీ కుమార్తెను సిద్ధంగా ఉండమని చెప్పండి. తను ఆదివారం రోజు మన్‌కీబాత్ కార్యక్రమంలో వస్తుంది అని చెప్పారు. శనివారం ఉదయం మా నాన్న నాకు చెప్పినప్పుడు నా ఆనందం ఆకాశాన్నంటింది. వాళ్లు వచ్చినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అనిపించింది. తరువాత మా ఇంట్లో , హైస్కూల్‌లో, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద విజువల్స్ తీసుకున్నాం. ఇక ఆదివారం రానే వచ్చింది. నేను అమితానందానికి లోనయ్యాను. ఆ ప్రోగ్రాంలో ప్రధాని నా లైబ్రరీ ఇన్షియేటివ్ గురించి మాట్లాడిన సందర్భం నా జీవితంలో మరుపురానిది.
ప్ర: ప్రధానిని మీరు వర్చువల్‌గా కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు ? మీరేమైనా మీ లైబ్రరీల గురించి చెప్పారా..?
జ: అవును నేను టెలివిజన్ లైవ్‌లో ఉన్నప్పుడు నా లైబ్రరీల గురించి చెప్పాను. కానీ, నేను ప్రధానిని కలవలేదు. నన్ను ప్రశంసిస్తూ 2021లో అభినందన పత్రం ఇచ్చారు. అప్పుడు నా లైబ్రరీ ఇన్షియేటివ్ను అభినందించి, మన్‌కీబాత్ కార్యక్రమంలో దీనిని ప్రస్తావించడం ఆరోజే నిర్ణయించారు. కానీ ఎప్పుడూ అనేది చెప్పలేదు. ఆయన లైబ్రరీ ఇన్షియేటివ్ గురించి చెప్పిన తరువాత బహుశా మీ కుమార్తె మోదీని కలవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి కబురు వచ్చింది. ఆ విషయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ప్ర: లైబర్రీలు స్థాపించాలనే ఆలోచన మీకెలా వచ్చింది..?
జ: కొవిడ్ సమయంలో నేను మా తల్లిదండ్రులతో ఎంఎన్‌జే క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్లో పిల్లలకు ఆహారం పంచడానికి వెళ్లాను. అది 55 రోజల పాటు కొనసాగింది. ఆ సమయంలో నేను వెళ్లి ఆహారం ఇచ్చివచ్చేదాన్ని. ఆ తరువాత నేను వాళ్లతో మాట్లాడడం ప్రారంభించాను. అప్పుడు నేను వాళ్లను మీరెలా కాలాన్ని గడుపుతున్నారు.. అని అడిగాను. అప్పుడు వాళ్లు అక్క మాకు కలరింగ్ బుక్స్ కావాలి. మాకు కీమోథెరపీ చేసే సమయంలో ఖాళీగా ఉండలేకపోతున్నాం అంటే వారికి బుక్స్ ఇచ్చాను. కానీ అప్పుడు తక్కువ మంది మాత్రమే అడిగారు. క్రమంగా వందల మంది అడగడంతో నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు మా తల్లిదండ్రులు నాకో సలహా ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో మెసెజ్ పెట్టు. స్పందన ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు. నేను మెసెజ్ పెట్టిన మరుసటి రోజు చాలా మంచి స్పందన లభించింది. కేవలం 3 రోజుల్లో 2వేలకు పైగా పుస్తకాలు సమకూరాయి. నా మిత్రులు, బంధువుల సాయంలో నేను 4 వేల పుస్తకాలు సేకరించలగలిగాను. దాంతో నేను పుస్తకాలు పంచాను. అప్పుడు ఆ క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ నాకీ సలహా ఇచ్చారు. దాంతోపాటు చిల్డ్రన్స్ వార్డు దగ్గర 1036 పుస్తకాలతో నా మొదటి లైబ్రరీ ఏర్పాటుకు స్థలాన్ని కూడా కేటాయించారు.
ప్ర: ప్రస్తుతం మీ వయస్సు 12 ఏళ్లు కానీ మీరు ఇప్పటికే 7 లైబ్రరీలను ఏర్పాటు చేశారు. మరో రెండు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయితే పుస్తకాలు సేకరించడం, లైబ్రరీ ఏర్పాటు చేయడం కష్టతరమా...? లేదా అందరి సహకారంతో సులభంగా సాగుతోందా..?
జ: ఇలా చేయడం బాగుంది. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. నాకు బయట నుంచి, మా అపార్ట్మెంట్ నుంచి, పాఠశాల నుంచి ఇలా చాలా రకాలుగా డొనేషన్లు వస్తున్నాయి. ఒక్క మెసేజ్ వల్ల ఇన్ని పుస్తకాలు సేకరించలగలిగాను. అలాగే నా లైబ్రరీల ద్వారా ప్రజలకు చదువే అలవాటు పెంపొందించేలా చేయడం చాలా సంతృప్తినిస్తోంది.
ప్ర: ఒకటి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర ఉంది మిగతా 6 ఎక్కడ ఉన్నాయి. త్వరలో రానున్న 2 లైబ్రరీల సంగతి ఏంటి..?
జ: నా రెండో లైబ్రరీ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద, మూడో లైబ్రరీ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్‌లో , నాలుగో లైబ్రరీ బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్ వద్ద ఉంది. దానికి రెండు వందల పుస్తకాలు డొనేట్ చేశాను. అయిదో లైబ్రరీ తమిళనాడులోని కోయంబత్తూర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఉంది. అక్కడ విభిన్నంగా వీధి గ్రంథాలయాలు ఉంటాయి. అక్కడి వీధి గ్రంథాలయాల గురించి నేను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాను. అప్పుడు నాకు వీరికి ఎందుకు ఇవ్వకూడదు..? అనిపించి వాళ్లకు ఇంగ్లీష్, తమిళం భాషలు కలిసి ఉన్న రెండు వందల జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు ఇచ్చాను. ఆరో లైబ్రరీని 1200 పుస్తకాలతో నొలంబో పోలీస్‌స్టేషన్ దగ్గర గల చెన్నై బాయ్స్ క్లబ్‌లో పెట్టాను. ఇక ఇటీవలే సనత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రారంభించాను. ఎనిమిదో గ్రంథాలయాన్ని వచ్చే శనివారం రోజున సిద్దిపేటలోని భరోసా సెంటర్‌లో ప్రారంభిస్తాను. తొమ్మిదో గ్రంథాలయాన్ని భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్‌కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 15న యూసఫ్‌గూడ లోని ప్రభుత్వ బాలికల అనాథాశ్రమంలో ప్రారంభిస్తాను.