హైదరాబాద్ మహానగరంలో వర్షం బీభత్సం ఇంకా కళ్లముందే మెదులుతోంది. రికార్డుస్థాయిలో కురిసిన వానలతో అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తెరిపినిచ్చిన వానలతో పరిస్థితులు కుదుపడుతున్న తరుణంలో మరోసారి వరుణుడు పంజా విసిరాడు. క్యుములో నింబస్ మేఘాల రూపంలో మరోసారి నగరవాసిని వణికించాడు.
గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి..
పాతబస్తీ పరిధిలో మళ్లీ వర్షం ముంచెత్తింది. అల్‌జుబెర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరదలతో ఇప్పటికే సర్వం కోల్పోయిన కాలనీవాసులు జోరువానతో అల్లాడిపోయారు. పాతబస్తీలోని బాబానగర్‌లో గుర్రం చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉప్పగూడ, సాయిబాబా నగర్, శివాజీనగర్, బాబా నగర్ బస్తీలను వరద ముంచెత్తింది. ఓల్డ్ మలక్ పేటలోని యశోదా ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి ఫుట్ పాత్ వెంబడి నడుచుకుంటూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవటం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా నిలిచిన వరదతో అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటం వల్ల వంతెనను మూసేశారు. మంగళ్‌హాట్ పరిధిలోని ఆర్‌కే పేట్‌లో వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి చెందింది.
నేలకొరిగిన విద్యుత్ సరఫరా
కాచిగూడ, నల్లకుంట, తార్నాక, ఎర్రగడ్డ, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లోనూ వర్షం పోటెత్తింది. మల్కాజ్ గిరి, లోని బన్సీలాల్‌పేట, నాచారం, అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు అపార్ట్ మెంట్లలో ముందు జాగ్రత్తగా లిఫ్టులు ఆపేశారు. నిజాంకాలనీ, టోలీచౌకీలో వరద ఉద్ధృతితో ప్రజలు అల్లాడిపోయారు. అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ అరుంధతినగర్ లో విద్యుతాఘాతంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. పలు చోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.