గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం రూ.2,500 కోట్ల విలువైన ఎస్సార్డీపీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పిల్లర్ల కోసం గుంతలు తవ్వడం, వాటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉన్నా.. ఇరువైపులా వాహనదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన అదనపు రోడ్డు మార్గాన్ని పట్టించుకోవడం లేదు. నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. వాన ధాటికి ఆ ప్రాంతం గుంతలమయం అవుతోంది. బహదూర్‌పుర కూడలిలో నిర్మిస్తున్న పైవంతెన నిర్మాణ పనులు అందుకు నిదర్శనం. విస్తరించిన రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయకుండా నిర్మాణ పనులు చేస్తుండటంతో.. ఆ ప్రాంతమంతా భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమైంది.
కష్టాలు తప్పడం లేదు
నాగోల్ కూడలి, ఎల్బీనగర్ కూడలి, మిథాని కూడలి, ఒవైసీ ఆస్పత్రి కూడలి, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45 ఎక్స్‌ప్రెస్‌వే పనులు దగ్గరా అదే దుస్థితి కనిస్తోంది. ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధికి భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో కాలనీ రోడ్లు గుంతలమయంగా మారాయి. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీసీఎల్) చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణాల దగ్గరా వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.