తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Road Problems : దయనీయంగా మారిన భాగ్యనగర రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

Story on Hyderabad Roads : హైదరాబాద్‌.. ఎన్నో దశాబ్దాల చరిత్రగల మహానగరం. తెలంగాణ రాష్ట్ర రాజధానిగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయా నగరం. ఇంటర్నేషనల్‌ ఐటీ కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత యూనివర్సిటీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. ఇలా ఎన్నింటికో నెలవు. లక్షల మంది ఉపాధి కోసం భాగ్యనగరంకు వచ్చి స్థిరపడిపోయారు. మరెంతో మంది నిత్యం వివిధ పనుల కోసం నగరానికి వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలెలా ఉండాలి? ఆ పరిస్థితి ఉందా? ముఖ్యంగా రోడ్ల పరిస్థితి భాగ్యనగరంలో మరి దయనీయంగా ఉంది. ఎక్కడిక్కడ పడ్డ గుంతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఈ ఇబ్బంది మరింత ఎక్కువవుంది. దీంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి, హైదరాబాద్‌ రోడ్లకు ఈ దుస్థితి ఎందుకు? అసలు బల్దియా అధికారులేం చేస్తున్నారు..? ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరిది..? ఇప్పుడు చూద్దాం.

Hyderabad Road Problems
Hyderabad Road Problems

By

Published : Aug 3, 2023, 10:02 PM IST

దయనీయంగా మారిన భాగ్యనగర రోడ్లు

Hyderabad Road Problems : భాగ్యనగరంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందంటే.. గుంతల కారణంగా మరణించిన వారి గురించి చెబితే సరిపోతుందేమో. ఒకే రోజు రోడ్ల గుంతల వల్ల నగరంలో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. అందులో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. నగరంలోని బాచుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దీక్షిత అనే 8 ఏళ్ల బాలిక మృతిచెందింది. కిశోర్ అనే వ్యక్తి తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా రోడ్డుపై గుంతల కారణంగా వాహనం స్కిడ్‌ అయ్యింది. ఈ క్రమంలో బాలికతో పాటు ఆమె తండ్రి కిందపడ్డారు. ఈ సమయంలోనే వెనుక నుంచి వచ్చిన బస్సు దీక్షిత పైనుంచి వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

Hyderabad Traffic and Roads : మరో రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పరిధిలో జరిగింది. విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి తన కుమార్తె వైష్ణవిని కళాశాలకు కోసమని ద్విచక్రవాహనంపై న్యూబోయిన్‌పల్లి చౌరస్తాలోని బాలానగర్‌ బస్టాప్‌ వద్ద దింపడానికి వస్తున్నాడు. అదే క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను గమనించి దానిని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం వైష్ణవి నడుం భాగం పైనుంచి దూసుకెళ్లింది. దీంతో దగ్గర్లోని ‌ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ వైష్ణవి మృతి చెందింది.

ముప్పుతిప్పలు పెడుతున్న రోడ్లు: ఈ రెండు ప్రమాదాలకు కారణం రోడ్ల గుంతలే. అయితే, ఈ రెండు ప్రమాదాలే కాదు... వర్షాల ధాటికి పాడైన రోడ్లతో నగరంలో చాలా చోట్ల రోడ్లు గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో గడప దాటిన వ్యక్తి.. ఇంటికి చేరుకునే వరకూ ఆందోళనే ఉంటుంది. కానీ, ప్రస్తుత గుంతలు కాలంతో సంబంధం లేకుండా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. నిజాంపేట, బోయిన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ప్రమాదాలే అందుకు నిదర్శనం. ఇవే కాదు.. నిత్యం నగరంలోని ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దారుణ రహదారులు నగరవాసుల ప్రాణం తీస్తున్నాయి. కొందరు గుంతలను తప్పించబోయి వాహన చక్రాల కింద నలిగిపోతుంటే.. మరికొందరు వాహనాలు అదుపుతప్పి గాయాలతో మృత్యువాతపడుతున్నారు. అంతేగాక, కాలినడక బాటలు లేక రోడ్డుపై నడుస్తూ ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా ఉన్నారు. రోడ్ల మరమ్మతలు సరిగ్గా నిర్వహించలేక.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లాంటి సంస్థల నిర్లక్ష్యంతోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే విమర్శలొస్తున్నాయి.

Bowenpally road accident : మృత్యుపాశమై వెంటాడుతున్న గుంతల రోడ్లు.. బోయిన్​పల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైష్ణవి మృతి


ఆ ప్రాంతాల్లో మరీ ఎక్కువ : గ్రేటర్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. అడుగడుగునా ఎక్కడిక్కడ గోయ్యిలు పడ్డాయి. దీంతో నిత్యం వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రధాన రోడ్లపై వాహనాలు వేగంగా ముందుకు కదల్లేని పరిస్థితి. కొన్నిచోట్ల ఇసుక మేట వేసి కొంచెం వేగంగా ముందుకు కదిలిన వాహనం స్కిడ్‌ అయ్యే అవకాశం ఉండటంతో చూసుకుంటూ నిమ్మెదిగా ముందుకు కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారులను కలిపే కాలనీ రోడ్లు చిల్లుల బొంతలా తయారయ్యాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, మియాపూర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కోఠి తదితర ప్రధాన ప్రాంతాల్లో లోని రహాదారులు చాలా అధ్వానంగా మారాయి. పరిస్థితి గురించి వర్షాల కంటే ముందే మేము చాలా సార్లు మంత్రులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు పలు విధాలుగా విన్నవించినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.

ప్రయాణికులకి నరకం : నగరంలో కురిసిన వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వరసగా కురిసిన వానలతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. వర్షాల తగ్గుదలతో హైదరాబాద్‌కు కాస్త ఉపశమనం లభించినా..గుంతలు పడిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన ప్రాంతాల రహదారుల్లో గుంతులు ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ఆఫీస్‌లకు వెళ్లి, వచ్చే సమయాల్లో నరకం కన్పిస్తోందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా నగరంలోని రోడ్లకోసం పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టిన వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో యంత్రాంగం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మరి, పూర్తిగా కంకర తేలి రోడ్లన్ని చెరువులను తలపించే వరకు అధికారులు ఎందుకు వేచి చూస్తున్నారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మరమ్మతుల విషయంలో ఇంజినీరింగ్‌ అధికారుల ఆశ్రద్ధ కొట్టొచ్చినట్టు కన్పిస్తోందని అంటున్నారు. వర్షాకాలం పరిస్థితి ఇలా ఉంటుందని ఏటా చూస్తున్నారు. ఐనా, ముందే మరమ్మతులకు పూనుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details