Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో వర్షం మళ్లీ మొదలైంది. తాజాగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలోని అత్తాపూర్, బోరబండ, మోతీ నగర్, సనత్ నగర్, అమీర్పేట్, ఎస్సార్ నగర్, మైత్రివనం, రహమత్నగర్, యూసఫ్ గూడా, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కూకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట్, సైదాబాద్, సరూర్నగర్, కొత్తపేటలో పడ్డ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై వర్షం నీరు వాగుల వలే ప్రవహిస్తోంది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ బోరంపేట్, తార్నాక, లాలాపెట్, ఓయూ క్యంపస్, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులు వర్షానికి తడిసిముద్దయ్యారు. వర్షంలోనే తడుస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఈ రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.