భాగ్యనగరం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరి... లోతట్టు ప్రాంతా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి,అల్వాల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆసిఫ్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నెలకొరిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, అల్వాల్ సమీపంలోని కొన్ని కాలనీలలో అడుగు బయటపెట్టే అవకాశం లేని పరిస్థితి.
పడవుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి...
భారీవర్షంతో మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్ఎమ్డీసీ కాలనీ, రాజనగర్, పటేల్ నగర్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై సుమారు మోకాలు లోతు వరకు నీరు చేరాయి. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరడం వల్ల.. వారంతా భవనాల పైకి ఎక్కి తలదాచుకోవాల్సి వచ్చింది. వర్షాలు తమకు శాపంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం గ్రేటర్ సిబ్బంది వారికి పాలు, మంచినీరు అందించారు. వీటిని ఇచ్చేందుకు అధికారులు పడవల్లో రావాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రోడ్లపై వరద.. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జాం