Hyderabad Rains : ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ ఆగమాగమైంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరి చేరి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. నాంపల్లి పటేల్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై కొబ్బరి చెట్టు పడిపోయింది. భారీ శబ్ధం రావడంతో చుట్టు పక్కల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. పాతబస్తీలోని మాదన్నపేటలో ఇంటి గోడ కారుపై పడి.. పూర్తిగా వాహనం ధ్వంసమైంది. నాగోల్ డివిజన్ అయ్యప్ప కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్, సిక్కు కాలనీలోకి వరద నీరు చేరింది. ఆక్రమణల వల్లే ఈ దుస్థితి వచ్చిందని కాలనీవాసులు ఆరోపించారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది.
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో పలు కాలనీలోకి వరద నీరు చేరి.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. విష్ణుపురి కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి పాములు, విష పురుగులు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ పురపాలిక పరిధిలో రహదారులు జలమయం అయ్యాయి. వినాయకనగర్, రాఘవేంద్రకాలనీల్లో మురుగు కాల్వవు పొంగి పొర్లాయి. కీసర మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సాయి సంజీవనగర్, అరవింద్ నగర్, సత్యనారాయణ కాలనీల్లో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు.
Rain In Hyderabad : గాజుల రామారం బాలాజీ లే అవుట్, వోక్షిత ఎంక్లేవ్, ఆదర్శ్‌నగర్‌లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. పెద్ద చెరువు అలుగు పారడంతో.. రోడ్లు జలమయమయ్యాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సాయి పూజిత కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించాయి. రాజేంద్రనగర్ హైదర్‌గూడలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.