Anti Drug Committees in Telangana Colleges: గోవా నుంచి మాదక ద్రవ్యాలను హైదరాబాద్‌కు తరలిస్తున్న ముఠాలపై హైదరాబాద్ పోలీసులు గట్టి నిఘాపెట్టారు. ఎడ్విన్, బోర్కర్‌తో పాటు మరికొంత మందిని హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఏజెంట్లను ఏర్పాటుచేసుకొని హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ముంబయి, పుణె, దిల్లీలాంటి మహానగరాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కళాశాలలకు చెందిన విద్యార్థుల జాబితా నిందితుల వద్ద లభించినట్లు వెల్లడించారు.
కొరియర్, డార్క్ వెబ్ ద్వారా విద్యార్థులు డ్రగ్స్ తీసుకొని వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారణైందని తెలిపారు. జాబితాలోని కొందరు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించగా.. కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యా సంస్థల్లో వెళ్లూనుకుపోతున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు నూతన ప్రణాళిక రచించారు. అవగాహన కల్పించే విధంగా హైదరాబాద్ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ:ప్రతి విద్యాసంస్థల్లోనూ మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తూర్పుమండల పరిధిలోని 55 డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐదుగురికి తగ్గకుండా సభ్యులతో కమిటీలు వేశారు. అందులో కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులతో పాటు, ముగ్గురు విద్యార్థులుంటారు.