మహిళల నుంచే 40 శాతం కాల్స్..
ప్రతిరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంకు సగటున 750 నుంచి 800 వరకు కాల్స్ వస్తున్నాయి. ఇందులో 40 శాతానికి పైగా కాల్స్ మహిళల నుంచే వస్తున్నట్లు గుర్తించారు.
సాధారణంగా డయల్ 100కు ఫిర్యాదు రాగానే కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. సుమారు 7 నిమిషాల్లో పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకుంటుంది.
అందులోని సిబ్బంది అంతా పురుషులే కావడంతో తమ సమస్యను చెప్పుకునేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికొచ్చింది.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ సజ్జనార్ ఈ అంశంపై కసరత్తు చేయాలంటూ డీసీపీ (షీ టీమ్స్) అనసూయకు సూచించారు. ఆమె క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ‘షీ టీమ్స్ డయల్ 100’కు రూపకల్పన చేశారు.
హెడ్‌కానిస్టేబుల్ నేతృత్వంలో..
ఒక్కో బృందంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ బృందానికి హెడ్‌కానిస్టేబుల్ నేతృత్వం వహిస్తారు. వీరికి మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మహిళల నుంచి కంట్రోల్ రూంకు ఫిర్యాదు రాగానే ఈ బృందాన్ని పంపుతారు. వారు అక్కడికక్కడే కౌన్సెలింగ్ ఇస్తారు. పరిస్థితి చేయిదాటి పోయేలా ఉంటే స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న ఒక్కో పీఎస్ పరిధిలో ముందుగా ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మియాపూర్, రాజేంద్రనగర్, జగద్గిరిగుట్ట ఠాణాల పరిధిలో అందుబాటులోకి తేనున్నారు.
ఇదీ చూడండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష