హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) కీలకమైన డ్రగ్ డీలర్ నరేంద్ర ఆర్యను ఇటీవల అరెస్టు చేశారు. ఇతడు కరోనా లాక్డౌన్ సమయంలోనే ఇద్దరు డెలివరీ బాయ్స్‌ను ఏర్పాటు చేసుకొని 450 మందికి డ్రగ్స్ అందించినట్టు గుర్తించారు. ఆ తరువాత డార్క్‌నెట్ ద్వారా హైదరాబాద్‌కు ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలు చేరవేస్తూ వచ్చాడు. గోవాలో ఇతడి లాంటి డీలర్లు వందల సంఖ్యలో ఉంటారని పోలీసుల అంచనా.
రూ.లక్షల్లో ఆదాయం వస్తుండడంతో వ్యసనపరుల్లో 50 శాతం మంది క్రమంగా విక్రయదారులు/డీలర్లుగా మారుతున్నట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు అలవాటుపడిన వారిలో కొందరికి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారితో పరిచయాలున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి ద్వారా ఆ ప్రాంతాల వారికి మత్తుపదార్థాలు సరఫరా అయ్యాయా అని ఆరా తీస్తున్నారు.
దుస్తుల ముసుగులో:డార్క్‌నెట్‌లో వ్యాపారం చేసే ఏజెంట్లు మొబైల్ ఫోన్లలో కేవలం 20-30 క్షణాల్లో సరకుకు ఆర్డర్లు ఇస్తున్నారు. కొరియర్ ద్వారా 24 గంటల్లో గమ్యానికి చేర్చుతున్నారు. డ్రగ్స్ పార్సిళ్లను చీరలు, టీ షర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులుగా నమ్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లు వాడుకుంటున్నారు. తేలికగా తెరిచేందుకు వీల్లేకుండా ప్యాకింగ్‌లో 10-15 కవర్లు చుట్టి దృఢంగా మార్చుతున్నారు. ఇలా హైదరాబాద్‌లో రోజూ 200-250 మందికి సరఫరా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్ పోలీసులు ఛేదించాక.. ఆ సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. మత్తుకు అలవాటుపడిన వారికి ఏపీ, తెలంగాణల్లో డీజేలు, ఈవెంట్ మేనేజర్లతో సంబంధాలున్నట్టు తాజాగా వెలుగు చూసింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో కొన్ని ముఠాలు డ్రగ్స్ సరఫరాకు వ్యభిచారిణులను ఉపయోగించుకుంటున్నాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో విటులు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. ఇదే అదనుగా వారికి డార్క్‌నెట్ ద్వారా ఏజెంట్లు సరకు అందజేస్తున్నారు.
ఓ తండ్రి కఠిన నిర్ణయం:నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు (25) విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. యువతీ, యువకులకు ఎల్ఎస్డీ బ్లాట్స్ను విక్రయించేవాడు. సంపాదన పెరగటంతో డ్రగ్స్ విక్రేతగా మారాడు. గోవా నుంచి సరకు తీసుకొచ్చి వందలాది మందికి చేరవేస్తున్నాడు. ఇతడు గతంలో రెండుసార్లు పట్టుబడగా, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మారలేదు. ఇటీవల మూడోసారి పట్టుబడినప్పుడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అతడి తండ్రి కోరినట్టు సమాచారం.