Hyd Police Commissioner Post is Absent in Website: సాంకేతిక పరిజ్ఞానంలో మాకు మేమే సాటి అంటారు.. దేశంలోనే తమతో ఎవరూ పోటీపడలేరని తెలంగాణ పోలీసులు అంటుంటారు కానీ సొంత వెబ్‌సైట్ నిర్వహణలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఐపీఎస్ ఉన్నతాధికారుల బదిలీలు జరిగి 15 రోజులు గడిచినా తాజా పోస్టుల్ని పూర్తిస్థాయిలో నమోదు చేయలేదు. కొత్త పోస్టుల్లోకి మారిన అధికారుల జాబితాను ఇంకా అప్‌డేట్ చేయలేదనుకుంటే మరిచిపోయారులే అనుకోవచ్చు. కానీ పలువురి పోస్టులను అప్‌డేట్ చేసి.. కొన్ని కీలక స్థానాలను వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వెబ్‌సైట్‌లో ఉండేది కేవలం ఐపీఎస్ అధికారుల వివరాలు మాత్రమే. ప్రస్తుతం 124 మంది పలు స్థానాల్లో ఉన్నారు. కేవలం ఇన్ని పోస్టులనే అప్‌డేట్ చేయలేకపోవడం పోలీస్‌శాఖ నిర్లిప్తతను తేటతెల్లం చేస్తోందనే విమర్శ వినిపిస్తోంది.
Telangana Police Website : వెబ్‌సైట్‌లో ఎస్పీఎఫ్ డీజీ పోస్టునే ఎత్తేశారు. రాష్ట్ర పోలీస్‌శాఖలో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఉమేశ్ షరాఫ్ ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ పోస్టుతోపాటు ఎస్పీఎఫ్ అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కానీ ఆ సంగతే మరిచారు.
*రాష్ట్రంలో డీజీపీ పోస్టు తర్వాత కీలక స్థానం హైదరాబాద్ నగర కమిషనర్. వెబ్‌సైట్‌లో ఎక్కడా ఈ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. నగర కొత్వాల్‌గా ప్రస్తుతం సీవీఆనంద్ ఉన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు ఏడీజీపీగా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తూ హైదరాబాద్ కమిషనర్ పోస్టునే ఎత్తేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను మాత్రం సైబరాబాద్ కమిషనర్‌గానూ పేర్కొన్నారు.