Hyderabad Police Arrested Cyber Criminals : పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. సైబర్ మోసగాళ్లు.. కంపెనీల పేర్లతో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట టెలీగ్రామ్, వాట్సాప్‌లకు సందేశాలు పంపుతారు. తాము ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేస్తూ.. రోజూ రూ.900 నుంచి రూ.1500 వరకూ సంపాదించొచ్చంటూ ఆశ చూపుతారు. పెద్దఎత్తున నగదు రాగానే మాయగాళ్లు ఖాతా రద్దు చేస్తారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్ రూ.28 లక్షలు పోగొట్టుకొని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్‌ల పేరిట.. 6 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో బాధితుడు జమ చేశాడు. ఆ ఖాతాల నుంచి నిందితులు.. మరో 48 ఖాతాలకు మళ్లించారు. ఈ విధంగా వేల మంది నుంచి ఆ బ్యాంకు ఖాతాల్లో రూ.584 కోట్లు జమ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రాధికా మర్చంట్స్ అనే నకిలీ కంపెనీ పేరుతో.. మహ్మద్ మున్వర్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించి.. నగదు లావాదేవీలు నిర్వహించినట్లు నిర్ధారించారు. బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన సెల్‌ఫోన్ నంబరు ఆధారంతో కూపీ లాగటంతో బోగస్ కంపెనీల బాగోతం బయటపడింది.
చైనాతో లింకులు..: లఖ్‌నవూకు చెందిన దళారులు వికాస్, మనీష్, రాజేష్ ఆదేశాలతో.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మున్వర్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, ఎస్.సుమేయర్.. వారి వద్దకు చేరారు. 3 నెలల పాటు అక్కడే ఉండి 33 బోగస్ కంపెనీల పేరిట వేర్వేరు బ్యాంకుల్లో 65 ఖాతాలు తెరిచారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ మోసాల్లో కొట్టేసిన రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రెండు బ్యాంకు ఖాతాల ఆధారంగా చైనా లింకులు బయటపడ్డాయి. పలు బ్యాంకు ఖాతాల్లో రూ.పదిన్నర కోట్ల నగదు సీజ్ చేశారు. బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనంలో హైదరాబాద్ సీపీ ఆనంద్.. సైబర్ మోసగాళ్ల వివరాలు వెల్లడించారు.
చైనాకు చెందిన కెవిన్ జూన్, లౌ లాంగ్జౌ, షాషా సైబర్ మోసాల సూత్రధారులు. వీరు భారత్‌లోని ఏజెంట్లు, దళారులను..వాట్సాప్, టెలీగ్రామ్‌ల ద్వారా చేర్చుకున్నారు. అహ్మదాబాద్ చెందిన కుమార్ ప్రజాపతి, ప్రకాశ్ ప్రజాపతి సోదరుల ద్వారా.. చైనా మాయగాళ్లు పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట మోసాలకు అవసరమైన సహకారం తీసుకున్నారు. వీరి ద్వారానే బోగస్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. భారత్‌లోని వివిధ బ్యాంకులకు చెందిన 113 బ్యాంకు ఖాతాల లావాదేవీలను ఇక్కడే నిర్వహిస్తే ఐపీ అడ్రస్ ద్వారా పట్టుబడే అవకాశం ఉండటంతో కొత్త ఎత్తువేశారు. ఈ బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన సిమ్‌కార్డులను దుబాయ్ చేర వేశారు. ఖాతాల్లోని భారతీయ కరెన్సీని క్రిప్టోగాా మార్చేందుకు కుమార్ ప్రజాపతి సహకారం తీసుకున్నారు. వాలెట్ల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చిన సొమ్ముతో కొంత భాగం హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు చేరినట్లు నిర్ధారించారు. సమాచారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందజేసినట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.