భాగ్యనగరం, శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కూడా మద్యం లభిస్తుండటంతో కొందరు మోతాదుకు మించి తాగుతున్నారు. మద్యం మత్తులో కార్లు, ద్విచక్ర వాహనాలపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. 15 రోజులుగా ప్రమాదాలు పెరుగుతుండటంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రణాళికా ప్రకారం..
రాత్రివేళల్లో నమోదవుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు లేకపోవడంతో.. పోలీస్ ఠాణాల వారీగా మద్యం దుకాణాలు, రాత్రివేళల్లో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటి వివరాలను గస్తీ పోలీసులకు ఇస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మద్యం దుకాణాలు, హోటళ్ల పరిసర ప్రాంతాలు, రహదారుల వద్ద వాహన చోదకుల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. అబిడ్స్, జగదీష్ మార్కెట్, బ్యాంక్‌స్ట్రీట్, కోఠి, సుల్తాన్‌బజార్‌తోపాటు పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాల్లో పర్మిట్ రూంలపైనా దృష్టి కేంద్రీకరించారు.