Bonsai Plants Cultivation in Hyderabad : బోన్సాయ్ మెుక్కల కళ చాలా ప్రాచీనమైనది. మెుదటగా చైనాలో ప్రారంభమైన ఈ మెుక్కల పెంపకం 18వ శతాబ్ధంలో భారత్లో ప్రవేశించింది. పెద్ద పెద్ద వృక్షాలను మరుగుజ్జు చెట్లుగా ఇంటి పరిసరాల్లో పెంచుకోవటమే బోన్సాయ్ ప్రత్యేకత. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మెుక్కల పెంపకంపై పెద్ద ఎత్తున ఆసక్తి ఏర్పడింది. కేవలం పర్యావరణం పరంగానే కాకుండా వ్యాపారపరంగానూ ఈ మొక్కలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో గృహిణులు ఈ మెుక్కల పెంపకానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అగ్రి, హార్టికల్చర్ సొసైటీలు బోన్సాయ్ పెంపకంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
సాధారణంగా మూడు రకాలైన బోన్సాయ్ మొక్కల పెంపకం ఉంటుంది. వీటి ధర రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ ఉండటంతో ఎక్కువగా సంపన్నుల ఇళ్లలో లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఇవి దర్శనమిస్తుంటాయి. కరోనా నేపథ్యంలో నగర సేద్యానికి ఆదరణ పెరిగినట్లే.. ప్రస్తుతం బోన్సాయ్ వృక్షాల పెంపకానికి సైతం అధిక డిమాండ్ ఏర్పడుతుందని వృక్ష నిపుణులంటున్నారు.
బోన్సాయ్ మొక్కల పెంపకానికి అవసరమైన సేంద్రీయ ఎరువులు ఇతరత్రా అందుబాటులో ఉంచుతున్నట్లు హార్టికల్చర్ సొసైటీ నిర్వాహకులు తెలుపుతున్నారు. బోన్సాయ్ మొక్కల ఖరీదు రూ.వేల నుంచి రూ.లక్షలు పలుకుతుండటంతో మహిళలకు ఆదాయ పరంగానూ మంచి గిట్టుబాటుందని అంటున్నారు.