తెలంగాణ

telangana

ETV Bharat / state

RAIN EFFECT: చెరువుల కట్టలు పదిలమేనా?

హైదరాబాద్​లో వర్షం(rain in hyderabad) పడుతుందంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లే చెరువుల్లా మారిపోతున్నాయి. ఇక చెరువుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుంటలు, చెరువుల పక్కనే ఉండే వారైతే వర్షాలు రాకపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. వరద ఎక్కువై కట్టలు తెగిపోతాయోమేనని భయపడటమే అందుకు కారణం.

hyderabad-people-facing-problems-with-rain
RAIN EFFECT: చెరువుల కట్టలు పదిలమేనా?

By

Published : Jul 16, 2021, 8:09 AM IST

మహానగరంలో చెరువులకు సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని అనేక చెరువుల్లో పూర్తిగా నీరు చేరింది. వర్షాలు మరికొన్ని రోజులుపాటు ఇలానే పడితే అనేక చెరువుల కట్టలు తెగిపోయే అవకాశం ఉందన్న ఆందోళన రేగుతోంది.

కప్రాయ్‌ చెరువు..

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని కప్రాయ్‌ చెరువు కారణంగా గతేడాది హరిహరపురం సహా 9 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువుకు ఉన్న రెండు తూములు మూసుకుపోవడంతో నీరు పారే మార్గం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో గుర్రంగూడ అటవీ ప్రాంతం నుంచి ఇంజాపూర్‌ రాచకాల్వ ద్వారా పెద్దఅంబర్‌పేటకు వరదను మళ్లించాల్సి ఉంది. మధ్యలో ప్రైవేటు వెంచర్‌ ఉండటంతో అక్కడ భారీ పైపుతో నిర్మాణం చేయాల్సి ఉన్నా, పనులు ప్రారంభించలేదు.

అప్పాచెరువు...

గగన్‌పహాడ్‌లోని అప్పాచెరువు 34.08 ఎకరాలుండగా ఆక్రమణలతో 12 ఎకరాలకు కుదించుకుపోయింది. గతేడాది అక్టోబరులో వర్షాలకు చెరువు కట్ట తెగి నలుగురు కొట్టుకుపోయారు. రూ.20లక్షలతో తూతూమంత్రంగా మట్టి పోసి కట్ట వేయడంతో ఇటీవల వర్షాలకు మళ్లీ కోతకు గురై నీరు లీకవుతున్న పరిస్థితి.

బురాన్‌ఖాన్‌ చెరువు..

జల్‌పల్లి పరిధి బురాన్‌ఖాన్‌ చెరువు 28 ఎకరాలల్లో విస్తరించింది. గతేడాది చెరువు నుంచి వరద పోటెత్తి ఉస్మాన్‌నగర్‌ను ముంచెత్తింది. రెండున్నర నెలలపాటు 300 ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చివరికి చెరువుకు గండి కొట్టి నీటిని పంపించారు. చెరువు చుట్టూ కట్ట ఏర్పాటుకు రూ.20లక్షలు కేటాయించినా ఇంకా నిర్మాణ పనులు చేయలేదు. ఉస్మాన్‌నగర్‌లో మురుగు, వరదనీరు పారేందుకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టగా పనులు కొనసాగుతున్నాయి.

ఫాక్స్‌సాగర్‌..

జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌సాగర్‌ చెరువు 550 ఎకరాలకుగాను 150 ఎకరాలు మిగిలింది. వరదలకు చెరువు నుంచి నీరు పోటెత్తి ఉమా మహేశ్వరకాలనీ సహా ఐదు బస్తీలు నీట మునిగాయి. ఉమామహేశ్వర కాలనీలో 642 కుటుంబాలు రెండు నెలలపాటు ముంపులో ఉండిపోయాయి. ఆ తర్వాత అధికారులు కాలనీ వైపు 12 అడుగుల ఎత్తులో నీరు రాకుండా గోడ కట్టారు. వరదనీటి మళ్లింపునకు పైపులైను పనులు చేపట్టగా ఇంకా పూర్తి కాలేదు. చెరువుకు ఉన్న రెండు గేట్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ పనులు ముందుకు సాగలేదు.

ఇదీ చూడండి:RAIN ALERT: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details