ఓ మోస్తరు వర్షం కురిసిందంటే ఖైరతాబాద్‌లోని రైల్వే గేటు సమీపంలోని జాతీయ రహదారిలో తరచూ రోడ్లపై నీరు నిలుస్తోంది. భారీ వర్షం వచ్చిందంటే ఆ మార్గం దాదాపు మూతపడినట్లే. మెట్రో స్టేషన్ ఏర్పాటుకు ముందు ఇంతగా నీరు నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఎగువన లక్డీకాపూల్‌లోని నిరంకారీ భవన్, ఏసీగార్డ్స్, చింతల బస్తీ ప్రాంతాల నుంచి వర్షపునీరు దిగువన ఉన్న రైల్వే గేటు సమీపంలో రాజీవ్ కూడలికి చేరుతుంది. ఇక్కడి నుంచి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉన్న బల్కాపూర్ నాలాకు పైపులైన్ అనుసంధానం ఉండేది. గతంలో నీటి వరద వచ్చింది వచ్చినట్లే పైపులైన్ మార్గంలో నాలాలో కలిసి వెళ్లేది.
మెట్రో స్టేషన్ నిర్మాణ సమయంలో ఈ మార్గంలో వెళ్లే పైపులైన్ దెబ్బతినడంతో నీరు సాఫీగా వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో ఓ సారి ఈ పైపు లైన్‌లో వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేయగా.. పెద్ద ఎత్తున సిమెంట్ బస్తాలు లభించాయి. ఇలాంటి వ్యర్థాలు పైపుల్లో ఇరుక్కోవడం, వాటిని తొలగించే సరైన సాంకేతికత లేని కారణంగానే నీరు ముందుకు పోవడం లేదు. ఫలితంగానే, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు మొత్తం పోవాలంటే వర్షం తగ్గాక కనీసం గంటకు పైగా సమయం పడుతోంది.
లక్డీకాపూల్ కూడలిలోనూ..
లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వద్ద(లక్కీ హోటల్ ఎదుట) సైతం ఇదే పరిస్థితి. ఒకవైపు ఎగువ ప్రాంతం కావడం.. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే లైన్ ఉండటంతో ఎటూ వేగంగా వెళ్లలేని తీరు నెలకొంటోంది. రైల్వే ట్రాక్ మార్గంలో పైపులైన్ ఉన్నా.. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు మొత్తానికి అదొక్కటే దిక్కు కావడంతో కాసేపు ఈ సమస్యను ఎదుర్కోవడం తప్పనిసరిగా భావిస్తున్నారు. లేనిపక్షంలో రైల్వే ట్రాక్ మార్గంలో మరోపైపు లైన్‌ను కూడా వేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు.