Hyderabad Outer Ring Rail Project :గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ జరుగుతోంది. ఓవైపు ఈ ప్రాజెక్టు కొనసాగుతుండగానే.. మరో భారీ ప్రాజెక్టు సర్వేకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఔటర్ రింగ్ రైల్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్)కు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Telangana Regional Ring Road : తెలంగాణ ఆర్ఆర్ఆర్ భూసేకరణకు కసరత్తు షురూ
ఈ మేరకు సర్వేను వీలైనంత త్వరగా చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో రూ.12 వేల 408 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రీజినల్ రింగ్ రోడ్ కోసం సేకరించిన భూసేకరణ ప్రాంతంలోనే ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రీజినల్ రింగ్ రోడ్ అభివృద్ది చెందే ప్రాంతంలో టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ జోన్‌లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
Hyderabad Regional Ringroad Project :ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుందో రైల్వే శాఖ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్ వనంపల్లి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లనుంది.