numaish in hyderabad 2022 : కొత్త ఏడాదిలో హైదరాబాద్ నగరవాసులను అలరించేందుకు 81వ నుమాయిష్ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే వస్త్ర, వస్తు ప్రదర్శన కోసం జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల అనుమతులు తీసుకున్నామని సొసైటీ తెలిపింది.
పక్కాగా కొవిడ్ నిబంధనలు
హైకోర్టు మార్గదర్శనాలు అమలు చేస్తూ.. కొవిడ్ నేపథ్యంలో స్టాళ్ల సంఖ్యను సైతం 1600 కు కుదించారు. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల నడుమ.. మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేసి నుమాయిష్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభా శంకర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మకశ్మీర్, పశ్చిమ బంగ తదితర రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి.
అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు
నాంపల్లి వస్తు ప్రదర్శనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మధ్య మండల ఇంఛార్జి డీసీపీ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులతో సమావేశమై... పలు సూచనలు చేశారు. స్టాళ్ల వద్ద తీసుకున్న చర్యలను తనఖీ చేశారు. ఫైర్, ఎలక్ట్రికల్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల అనుమతులు వచ్చాయని..అన్నింటిని సీపీకి సమర్పించామన్నారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.