Hyderabad National Book Fair: ఏటా సాహితీ ప్రియులను అలరించే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఈనెల 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్... ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే 34వ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
గతేడాది కొవిడ్ కారణంగా బుక్ ఫెయిర్ నిర్వహించలేకపోయామని... ప్రస్తుతం ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.. కరోనా నిబంధనలతో పుస్తక ప్రదర్శనను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు బుక్ ఫెయిర్‌లో లభ్యమవుతాయని.. ఇందులో 250 స్టాళ్లు కొలువుదీరుతున్నాయని తెలిపారు. పుస్తకాల క్రయవిక్రయాలతో పాటు.. సాహితీ సమ్మేళనాలు, వక్తృత్వ పోటీలు, పుస్తకావిష్కరణలు పదిరోజుల బుక్ ఫెయిర్‌లో ఆకట్టుకుంటాయని గౌరీశంకర్ అన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు... శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ ఉంటుందని ఆయన తెలిపారు.