GHMC Negligence : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిర్లక్ష్యం వల్ల లక్షలమంది వాహనదారులు ఈ వర్షాకాలంలో కూడా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. నగరంలో భారీ వర్షాలతో చెరువుల్లా మారే నీటి నిల్వ ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాల్సిన బల్దియా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. వాహనాలు కదలకుండా నిల్చిపోయే 50 నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి అక్కడ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరినా బల్దియా స్పందించలేదు. కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే పనులు మొదలుపెట్టి వదిలేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడితే నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిల్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
Flood Issues in Hyderabad :రాజధాని రోడ్లపై ప్రతి రోజూ 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఏదైనా ప్రధాన రహదారిపై చిన్న ప్రమాదం జరిగినా.. చిన్నపాటి వర్షం పడినా గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడం పరిపాటి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రాఫిక్ పోలీసులు రహదారులపై వరద నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించారు. చెరువుల్లా మారే 50 నీటి నిల్వ కేంద్రాల జాబితాను ట్రాఫిక్ పోలీసులు బల్దియా అధికారులకు అందజేశారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయం చేస్తే ఇందులో చాలా చోట్ల నీరు నిల్వ లేకుండా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.