గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని సర్కిళ్లలో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తచెదారం, విరిగిపడిన చెట్ల కొమ్మలు, నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను పూర్తిగా తొలగించి నగరాన్ని పరిశుభ్రంగా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మేయర్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిచేసిన వెంటనే ఎంటమాలజి విభాగం ద్వారా క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ చేయించాలని రామ్మోహన్ సూచించారు. ప్రతి కాలనీలో ఉన్న చెత్తను ఇతర వ్యర్థాలను తొలగించక ముందు, తర్వాత మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు.