హైదరాబాద్ మహా నగరంలో వేసవి కాలంలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ. 50 కోట్లతో జలమండలి వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నగరంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని, అవసరం మేరకు మంచినీరు ఉందని సంస్థ ఎండీ దాన కిషోర్ తెలిపారు. వేసవి కార్యాచరణపై అయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
48 గంటల్లో ఇంటికి ట్యాంకర్
ఇప్పటికే ఉన్న వాటికి తోడు అదనంగా మరో 230 అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే మరో 23 ఫిల్లింగ్ స్టేషన్లు, 110 ఫిల్లింగ్ పాయింట్లను అదనంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ట్యాంకర్ వస్తుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
సరఫరా పరిశీలనకు 10మంది ప్రత్యేక అధికారులు
విద్యుత్ కోత జరిగే ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి, ట్యాంకర్ల మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు మినీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా సక్రమంగా జరిగేలా 10 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. వీరు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎక్కడైనా సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడ నల్లాలు, ట్యాంకర్ల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటారు. సరఫరాలో ప్రెషర్, ఫిల్లింగ్ స్టేషన్లు పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్ పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించనున్నారు. అవసరమైతే రిపేర్లు చేయాలని సమావేశంలో దాన కిషోర్ నిర్దేశించారు.
వృథా కాకుండా మరమ్మతుల నిర్వహణ
సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న స్టాటిక్ ట్యాంకులకు రిపేరు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత నీటి వల్ల నీరు వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, వాల్వ్‌లు, జంక్షన్లకు మరమ్మతులు చేయాలని ఎండీ ఆదేశించారు. నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు పనులు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్‌లతో పాటు సంబంధిత సీజీఎమ్‌లు, జీఎమ్‌లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య