Hyderabad Metro Staff Protest Today: హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది నేడు భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత రెండు రోజులుగా విధులకు హాజరుకాకుండా ఆందోళన చేపడుతున్నా తమ డిమాండ్లకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఇవాళ మరోమారు తమ గళాన్ని వినిపించనున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నారు. దాదాపు 450 మందికి పైగా మెట్రో టికెటింగ్ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా మిగతా కారిడార్లలో టికెటింగ్ సిబ్బంది కూడా ధర్నా చేయనున్నారు.
2 రోజులుగా ఎల్‌బీనగర్- మియాపూర్ కారిడార్లలో విధులకు హాజరుకాకుండా ధర్నా చేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని మెట్రో సిబ్బంది వాపోతున్నారు. నిన్న కూడా విధులకు హాజరు కాకుండా నాగోల్ మెట్రో డిపో వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది ధర్నాతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని భావించి సిబ్బందిలో పదిమందిని ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్(ఓసీసీ)లోకి చర్చలకు ఆహ్వానించింది యాజమాన్యం. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ, కియోలిస్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరిపారు.