తెలంగాణ

telangana

ETV Bharat / state

HYDERABAD METRO LANDS FOR SALE: అమ్మకానికి హైదరాబాద్​ మెట్రో భూములు - telangana government for sale

హైదరాబాద్​లో మరోసారి ప్రభుత్వానికి సంబంధించిన భూములను విక్రయించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్​ కార్పొరేషన్​కు.. సర్కారు ఇచ్చిన భూమిలో కొంత స్థలాన్ని లే అవుట్​ వేసి విక్రయించాలని.. మెట్రో అధికారులు నిర్ణయించారు. నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌లోని భూముల లేఅవుట్​ పనులను మెట్రో రైలు సంస్థ ముమ్మరం చేసింది. ఇప్పటికే రహదారులకు సంబంధించి మార్కింగ్‌ను గుర్తించిన అధికారులు.. ఆరు నెలల్లో 20 ఎకరాల్లో లేఅవుట్‌ వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండడం.. ఇక్కడ హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లకు భారీగా స్పందన రావడంతో మెట్రో అధికారులు విక్రయానికి సిద్ధమయ్యారు.

HYDERABAD METRO LANDS FOR SALE
HYDERABAD METRO LANDS FOR SALE

By

Published : Aug 4, 2021, 6:29 PM IST

Updated : Aug 4, 2021, 7:15 PM IST

హైదరాబాద్​లో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ప్రతి ఏడాది భారీగా ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల విక్రయించిన కోకాపేట్​, ఖానామెట్ భూములకు భారీ ధరలు పలికాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైలుకు ఉన్న భూములను కూడా ప్లాట్లు వేసి విక్రయించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. ఉప్పల్ భగాయత్​లో ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సంస్థ భారీ లేఅవుట్‌ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించింది. ఇదే తరహాలో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తన వద్ద ఉన్న మొత్తం 41 ఎకరాల్లో మొదట 20 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి.. ఆన్‌లైన్​లో విక్రయించి భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. లేఅవుట్​ వేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు మాత్రం అనుమతి రావాల్సి ఉంది.

గతంలో గజం.. రూ.50 వేలు నుంచి రూ.70వేలు..

నగరం మధ్యలోనే ఈ లేఅవుట్​ ఉండడం వల్ల మంచి డిమాండ్‌ ఉంటుందనే అంచనాలతో ప్లాట్లు వేస్తున్నారు. 2019లో ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లోని ప్లాట్లకు గజం రూ.50 వేల నుంచి రూ. 70 వేల వరకు పలికింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్​ ఎస్టేట్​ మార్కెట్​ జోరు మీద ఉండడంతో.. గతం కంటే ధర రావడం ఖాయమని మెట్రోరైలు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం కేటాయించిన భూమే..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఉప్పల్‌ భగాయత్‌లో సుమారు 104 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత భూమిని మెట్రో రైలు డిపో, ఇతర కార్యకలాపాల కోసం వినియోగించుకొంది. మిగిలిన భూమిలో ప్రీకాస్ట్​ యార్డ్​ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో 2012 నుంచి మైట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన వయాడక్ట్‌లు, ఇతర ప్రీకాస్ట్‌ ఉత్పత్తులను తయారు చేశారు. 2020 నాటికే ఈ పనులన్నీ పూర్తి కావడంతో ప్రస్తుతం 41 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలం హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌కు ఆనుకొని ఉంది. మొదటి దశలో 20 ఎకరాల్లో 200, 300, 500 గజాల్లో ప్లాట్లు ఉండేలా లే అవుట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు.

మొత్తం 41 ఎకరాలు..

నాగోల్‌-ఉప్పల్‌లోని మెట్రో రైలు డిపో, మెట్రోస్టేషన్‌కు ఇరువైపులా ఉన్న ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ లేఅవుట్​ వేసింది. అనేక మౌలిక వసతులు కల్పించింది. వీటికి తోడు మెట్రో రైలు దగ్గర, మూసీ వెంట మూడు కిలోమీటర్ల మేర పార్కును అభివృద్ధి చేసింది. అంతేకాక నాగోల్‌ మూసీ బ్రిడ్జి నుంచి ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ మీదుగా బోడుప్పల్‌ చేరుకునేందుకు ప్రత్యామ్నాయంగా రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019లో ఆ ప్లాట్లను విక్రయానికి పెట్టింది. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పన జరగడం వల్ల మంచి ధర వచ్చింది. ప్రస్తుతం అక్కడ జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌లో ఎన్నో అనుకూలతలు ఉండటంతో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తమ 41 ఎకరాలను లేఅవుట్‌ చేసి విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవలే కోకాపేట్​, ఖానామెట్‌ ప్రాంతాల్లో విక్రయించిన ప్రభుత్వ భూములకు మంచి ధర రావడంతో అదే తరహాలో ఉప్పల్‌ భగాయత్‌లోనూ అదేస్థాయి డిమాండ్‌ ఉంటుందనే అంచనాలో అధికారులు ఉన్నారు.

ఇదీచూడండి:Illegal Layouts: అనధికారిక లేఅవుట్లు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.!

Last Updated : Aug 4, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details