Hyderabad Metro 2nd Phase Update :హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. సవరించిన అంచనా రూ.9 వేల 100 కోట్లు అని కేంద్రానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ 5 కిలోమీటర్లు కలిపి మొత్తం 31 కిలోమీటర్ల మార్గం ఫేజ్-2బీగా ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయం తొలుత 8 వేల 453 కోట్లుగా అంచనా వేశారు.
Hyderabad Metro 2nd Phase Expansion 2023 :దిల్లీ మెట్రోరైలు సంస్థ-డీఎంఆర్‌సీ రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపారు. డీపీఆర్‌ను ఆమోదించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని గత ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటి ధరలకు అనుగుణంగా డీపీఆర్‌ను సవరించాలని చెబుతూ మొత్తం 15 అంశాలపై స్పష్టత ఇవ్వాలని, రాష్ట్రాన్ని కేంద్రం గతంలో కోరింది. కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని వివరణలను ఇప్పటికే తెలియజేశామని, అనుమతి కోసం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు.
Hyderabad Metro Phase 2 Latest News :సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద, మెట్రో రెండోదశ ఆమోదం ఏ దశలో ఉందో తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖను కోరగా, ప్రతిపాదన మదింపు దశలో ఉందని తెలిపింది. అలాగే 2023-24 బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆ శాఖ కార్యదర్శి వికాస్‌కుమార్ వెల్లడించారు.
అయితే కేంద్రం అడిగిన అంశాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 28న, ఆగస్టు 8న అన్ని వివరణలను కేంద్రానికి ప్రభుత్వం పంపించింది. బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ మార్గంలో పీక్ అవర్ పీక్ డైరెక్షన్ ట్రాఫిక్, పీహెచ్‌పీడీటీ డిమాండ్ తక్కువగా ఉందని కేంద్రం ఆక్షేపించింది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున వస్తున్న నిర్మాణాలు, రవాణా ఆధారిత అభివృద్ధి విధానంతో మరింత రద్దీ పెరుగుతుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో పీహెచ్‌పీడీటీ అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ, మెట్రో ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.