విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ఐదు మిలియన్ల మొక్కలు నాటడంతోపాటు 64 వేల హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఐరాస ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మేయర్ల సమావేశంలో హైదరాబాద్ మేయర్ విజయలక్మ్షి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటారెస్, లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిగ్ గర్సెట్టి... కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం, హరిత పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, అవలంభించాల్సిన లక్ష్యాలపై చర్చించారు.
ప్రపంచంలోని 40 ప్రముఖ నగరాల మేయర్లకు మాత్రమే ఈ సదస్సులో పాల్గొనడానికి అవకాశం లభించగా... భారత్ నుంచి హైదరాబాద్ మేయర్ మాత్రమే ప్రసంగించడానికి అవకాశం లభించింది. జీహెచ్ఎంసీలో విద్యుత్ వినియోగం 15 శాతం తగ్గించేందుకుగాను సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం, ఇంధన వినియోగం తగ్గించే విధంగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌లను ప్రవేశపెట్టామని వివరించారు.
తమ ప్రభుత్వం వేగంగా చేపట్టిన ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలతో కరోనా సాధారణ స్థితికి తేవడంలో సఫలం అయ్యామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కర్బన వాయువులను తగ్గించేందుకు సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి :కొవిడ్ విజృంభణ.. ఆలయాల్లో నిరాడంబర వేడుకలు