వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా బార్‌కౌన్సిల్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి న్యాయస్థానాల ముందు ఆందోళనకు దిగింది. హైకోర్టులోనూ బార్ అసోషియేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి కోర్టుల్లో విధులు బహిష్కరించారు. నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.
న్యాయవాదుల హత్యను ఖండిస్తూ.. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ గళమెత్తారు. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట రహదారిపై లాయర్లు బైఠాయించారు. ధర్నాతో ఎల్బీనగర్-దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతు తెలిపారు.