హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. కోటికి పైగా జనాభాతో... విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చే వారితో ప్రపంచ మహానగరాలతో పోటీ పడుతోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చే వారిని భాగ్యనగరం అక్కున చేర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నగరంలో నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతరాష్ట్ర నేరగాళ్ల ఆకృత్యాలు, చోరీలు, దోపిడీలు, హత్యలు, హత్యాచారాలు ఇలా పలుతరహా నేరాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న క్రైంకు తోడు... నేరం నుంచి బయటపడేందుకు నేరస్థుల చాకచక్యం ఎంతో పెరుగుతోంది. వీటిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా మొదటగా సీసీ కెమెరాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎక్కడ నేరం జరిగినా పోలీసులు మొదట ఎంచుకునేది సీసీ కెమెరాలనే అంటే... వాటికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది.
దేశంలో మొదటి స్థానం
లండన్‌కు చెందిన ఓ సంస్థ ఇటీవల విడుదల చేసిన సీసీ కెమెరాలు గల నగరాల జాబితాలో హైదరాబాద్ 16వ స్థానాన్ని దక్కించుకోగా.... దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరేళ్లుగా వీటి ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ వచ్చిన పోలీసులు... వాణిజ్య సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్టుమెంట్లలో నివాసం ఉండే వాళ్లతో చర్చించి నిఘా నేత్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు. పలు పారిశ్రామిక, ఐటీ సంస్థలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీలో భాగంగా సీసీ కెమెరాలు పలుచోట్ల బిగించారు. ఇలా హైదరాబాద్‌లో దాదాపు 3లక్షల 30వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలతో దర్యాప్తు సులభం
సీసీ కెమెరాలతో పోలీసుల దర్యాప్తు ఎంతో సులభం అవుతోంది. నేరం చేసిన వ్యక్తి పారిపోయే సమయంలో కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు లభ్యం అవుతున్నాయి. వీటితో నేరస్థుడికి పాతనేరాలతో సంబంధం ఉందా.... అతనెవరూ అనేది సులభంగా గుర్తించగలుగుతున్నారు. అంతేకాకుండా నేరస్థులు ఉపయోగించే వాహనాల ఆధారంగానూ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. గొలుసు దొంగలు, ఇళ్లల్లో చోరీలు, వాహనాలు ఎత్తుకెళ్లడం, హత్యలు, హత్యాయత్నం, అపహరణ, తప్పిపోవడం లాంటి కేసుల్లో పోలీసులు మొదట సీసీ కెమెరాల దృశ్యాలనే పరిశీలిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే సీసీ కెమెరాలను... సంబంధిత స్టేషన్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ఆ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఆ అక్కడ రికార్డైన దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే నేరాల్లో దాదాపు 80 శాతం సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు జరుగుతున్నాయంటే .... ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయేది అర్థం చేసుకోవచ్చు.