Hyderabad Home Guard Suicide Update :మంగళవారం హైదరాబాద్‌లోని గోషామహల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Commit Suicide) పాల్పడిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం డీఆర్డీవో(DRDO) అపోలో ఆస్పత్రికి తరలించారు. శరీరం 67 శాతం కాలిన గాయాలతో ఉందని తెలిపారు. హోంగార్డులను చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో ఆత్మహత్యకు యత్నించానని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
జీతం కోసం అడగడానికి వెళితే ఏఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందు అవమానించారని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన భర్త ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని.. హోంగార్డు కార్యాలయంలో ఏదో జరిగిందని రవీందర్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తకి మంచి వైద్యం అందించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను పలువురు హోంగార్డులు వెళ్లి పరామర్శించారు.
Miyapur Gun Fire Incident Solved : ఉద్యోగం పోయిందనే కోపంతో.. ఉసురు తీశాడు
Hyderabad Home Guard Suicide News Today : ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌కు మద్దతుగా నిలవాలని హోంగార్డుల సంఘం నిర్ణయం తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించాలంటూ కొంతకాలంగా హోంగార్డులు ఆందోళనలు చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని హోంగార్డుల సంఘం ఆవేదన చెందారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి హోంగార్డుకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. పదవీ విరమణ చేసిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. అలాగే హోంగార్డుల పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.