Electricity Demand In Hyderabad: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికన్నా గ్రేటర్ హైదరాబాద్‌లో రోజూవారీ విద్యుత్తు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. ఆ రాష్ట్రాల్లో ఒక్కోదానిలో ఒకరోజు వినియోగించే మొత్తం కరెంటుకన్నా ఇక్కడే అధికంగా ఉంటుండటం గమనార్హం.
రోజువారీ డిమాండ్...
హైదరాబాద్‌లో గరిష్ఠ రోజూవారీ డిమాండ్ (Electricity Demand In Hyderabad) గత వేసవిలో 3,431 మెగావాట్లు నమోదైంది. ఇది వచ్చే వేసవికి 4,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్న విద్యుత్ సంస్థలు పంపిణీ, సరఫరా వ్యవస్థ మెరుగుపై దృష్టి పెట్టాయి. 5,000 మెగావాట్ల సరఫరాకు సరిపడేలా లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిని పెంచుతున్నాయి. ఏటా సాధారణంగా 7 నుంచి 8 శాతం వరకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటుంది. కానీ గ్రేటర్ పరిధిలోని కొన్ని సర్కిళ్లలో గరిష్ఠ డిమాండ్ ఏడాదిలోనే 10 నుంచి 20 శాతం పెరుగుతోంది. దీన్ని తట్టుకునేలా సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడానికి రూ.వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు.
ఐటీ కారిడర్...
ఐటీ కారిడార్‌లో (It Corridor) డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రాయదుర్గంలో రూ.1200 కోట్లతో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నగరం చుట్టూ ఇలాంటి 400 కేవీ స్థాయి సబ్‌స్టేషన్లు 6 నిర్మించారు. బౌరంపేట, చంచల్‌గూడ ప్రాంతాల్లో 132 కేవీ సబ్‌స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.