తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో కుదేలైన హైదరాబాద్​ పండ్ల మార్కెట్ వ్యవస్థ - Hyderabad Fruit Market latest news

కొవిడ్ విలయతాండవంతో హైదరాబాద్​ పండ్ల మార్కెట్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గడ్డిఅన్నారం మార్కెట్​ యార్డులో రద్దీ తగ్గించేందుకు మామిడి, బత్తాయి మినహా మిగతా పండ్ల విక్రయాలను ఉప్పల్​కు బదలాయించిన మార్కెటింగ్ శాఖ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి పుచ్చకాయలు, కర్భూజ తీసుకొచ్చిన రైతులు రోడ్లపైనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Hyderabad Fruit Market
Hyderabad Fruit Market

By

Published : May 2, 2021, 4:27 AM IST

కరోనా వ్యాప్తిని నివారించడానికి హైదరాబాద్ గడ్డిఅన్నారం యార్డులో మామిడి, బత్తాయి మాత్రమే విక్రయాలకు అనుమతినిచ్చారు. పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి, దానిమ్మ అమ్మకాలకు ఉప్పల్​ శిల్పారామం పక్కన హెచ్​ఎమ్​డీఏ భగాయత్ లే ఔట్​లో మార్కెటింగ్​ శాఖ తాత్కాలిక అవకాశం కల్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియక మలక్​పేట, దిల్​సుఖ్​నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్​ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే అమ్ముకుంటున్నారు.

గత ఏడాది లాక్​డౌన్​.. ఆ తర్వాత భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులు.. కనీసం ఈ ఏడాదైనా గట్టెక్కుదామంటే.. కరోనా రెండోదశ పూర్తిగా దెబ్బతీసింది. మార్కెట్​లో అమ్మకాలకు అనుమతులు లేకపోడవంతో రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నారు. గిట్టుబాటు రాక పూర్తిగా నష్టపోతున్నారు.

దీనికి తోడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసమే నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తమకు సరైన వేదిక చూపాలని రైతులు, వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పట్లో గడ్డిఅన్నారం నుంచి కోహెడకు మార్కెట్​ తరలించే యోచన లేనందున సరైన ప్రత్యామ్నాయాలు చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ డెస్క్​

ABOUT THE AUTHOR

...view details