హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ చరిత్రలో తొలిసారి సంచలన తీర్పు వెలువడింది. వరదల్లో కొట్టుకుపోయిన రహదారికి బీమా పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 గురువారం భారీ జరిమానా విధించింది. ఫిర్యాదు చేసిన ‘స్వర్ణ టోల్‌వే ప్రైవేటు లిమిటెడ్’కు రూ.22.42 కోట్ల బీమా సొమ్మును 9 శాతం వడ్డీతో చెల్లించాలని, పరిహారం కింద రూ.5 లక్షలు, కేసు ఖర్చులు రూ.20 వేలు ఇవ్వాలని తీర్పు వెలువరించింది.
వినియోగదారుల కమిషన్ చరిత్రలో తొలిసారి సంచలన తీర్పు ఇదే!
వినియోగదారుల కమిషన్ చరిత్రలో తొలిసారి సంచలన తీర్పునిచ్చింది. రహదారికి బీమా పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కంపెనీకి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 గురువారం భారీ జరిమానా విధించింది.
తడ నుంచి నెల్లూరు వరకు జాతీయ రహదారి నిర్వహణకు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన స్వర్ణటోల్ వే సంస్థ ఎన్‌హెచ్‌ఏఐతో గతంలో ఒప్పందం చేసుకుంది. 2015లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఈ రహదారికి ‘అసెట్స్ అండ్ బిజినెస్ ఇంటరప్షన్ రిస్క్’ పాలసీ తీసుకుని రూ.32,90,871 ప్రీమియం చెల్లించింది. అదే సంవత్సరం నవంబరులో వరదలకు ఆ సంస్థ నిర్వహణలో ఉన్న రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీనిపై బీమా సంస్థకు సమాచారం ఇచ్చి పాలసీ డబ్బులు రూ.43,55,96,081 ఇవ్వాలని స్వర్ణటోల్ వే కోరింది. బీమా సంస్థ తొలుత రూ.4 కోట్లు చెల్లించి, నష్టాన్ని అంచనా వేసి మిగిలిన డబ్బు ఇస్తామని చెప్పింది. తర్వాత రిపోర్టులు, దస్త్రాలు అంటూ కాలయాపన చేయడంతో పాటు చివరకు రూ.8.5 కోట్లు ఇస్తామనడంతో వివాదం రాజుకుంది. దీనిపై స్వర్ణటోల్ వే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. తాత్కాలిక డైవర్షన్ కోసం తాము అదనంగా రూ.7.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబుతో కూడిన బెంచ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రూ.22.42 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.