తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా కొడుకు చేసింది తప్పే కానీ.. అంతకుముందు ఏం జరిగిందంటే' - వైశాలి కిడ్నాప్‌పై నవీన్ రెడ్డి తల్లి స్పందన

Naveen Reddy Mother Reaction: హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ స్పందించారు. తన కుమారుడు అమ్మాయి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయడం తప్పేనని అన్నారు. కానీ అంతకుముందు జరిగిన విషయాలపై కూడా దృష్టి సారించాలని నారాయణమ్మ పోలీసులను కోరారు.

Naveen Reddy Mother Reaction
Naveen Reddy Mother Reaction

By

Published : Dec 10, 2022, 1:17 PM IST

నా కొడుకు చేసింది తప్పే కానీ.. అంతకుముందు ఏం జరిగిందంటే

Naveen Reddy Mother Reaction : హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ ఈ సంఘటనపై స్పందించారు. వాళ్లిద్దరికి పెళ్లయిందని తన కొడుకు చెప్పాడని.. కానీ అయిందో లేదో తనకు తెలియదని స్పష్టం చేశారు. కానీ వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నది మాత్రం వాస్తవమని.. గతంలో ఇద్దరూ కలిసి చాలా సార్లు వెకేషన్లకు వెళ్లారని చెప్పారు. ఆ అమ్మాయి నవీన్‌ను ప్రేమించేదని.. తమ ఇంటికి కూడా చాలా సార్లు వచ్చిందని తెలిపారు.

Naveen Reddy Mother Reaction on dentist kidnap : శుక్రవారం రోజున తమ కుమారుడు నవీన్ రెడ్డి ఆ అమ్మాయి ఇంటిపై దాడి చేయడం.. ఆమెను కిడ్నాప్ చేయడం.. యువతి తండ్రిపై దాడికి దిగడం.. ఇదంతా తప్పేనని నిందితుడి తల్లి నారాయణమ్మ అన్నారు. కానీ పోలీసులు నవీన్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని వెనక గల కారణాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కిడ్నాప్ వెనుక జరిగిన సంఘటనలు, పరిణామాలపై పోలీసులు దృష్టి సారించాలని నారాయణమ్మ కోరారు.

"నా కొడుకు కష్టపడి సంపాదించాడు. నవీన్, ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా ఆ అమ్మాయి చాలా సార్లు వచ్చింది. కరోనా సమయంలో ఆమెను రోజు కారులో కళాశాల వద్ద దింపి వచ్చేవాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లు మా కొడుకు మాకు చెప్పాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా ఆ అమ్మాయి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడు. వాళ్ల కోసం కారు కూడా తీసుకున్నాడు. నిన్న ఆ అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే. కానీ అంతకుముందు జరిగిన విషయాలు కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. మా కుమారుడు వ్యాపారం కోసం చాలా కష్టపడేవాడు. ఒక్కోసారి పది రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. అంత కష్టపడి పైకి ఎదిగిన నా కుమారుడిని ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది. కానీ ఏవో కారణాల వల్ల గొడవలు జరిగాయి. ఆ అమ్మాయిని వదిలేయమని నవీన్‌కు చాలాసార్లు చెప్పాం. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు."

- నారాయణమ్మ, నవీన్ తల్లి

నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తండ్రి కోటిరెడ్డి అస్వస్థతకు గురవడంతో ఆయణ్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి నారాయణమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి ఆమె పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. తన కొడుకు అనవసరంగా ఆవేశానికి పోయి ఇలాంటి ఘటనలో ఇరుక్కున్నాడని నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details