Cyber Crime Gangs Arrested in Hyderabad : రాష్ట్రంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో కొత్త పద్ధతులతో ప్రజల డబ్బును దోచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కోట్లల్లో ప్రజల డబ్బులను దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. తాజాగా ఎస్బీఐ పేరిట ప్రజల ధనాన్ని దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
నేరాలకు పాల్పడుతున్న రెండు సైబర్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్బీఐ మకస్టమర్ కేర్ పేరిట మోసం చేస్తున్న ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. దరఖాస్తుదారులకు తెలియకుండానే.. వ్యక్తిగత రుణాలు తీసుకొని రూ.20 కోట్ల నష్టాన్ని కలిగించిన పదిమంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు.
Hyderabad Cyber Crimes :సైబరాబాద్ పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో.. రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఉంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కోసం సంప్రదించిన వారిని.. కస్టమర్ కేర్ ప్రతినిధులమని బురిడీకొట్టించి దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న ఘరానా సైబర్ నేరగాళ్ల ముఠా.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు చిక్కింది. క్రెడిట్‌కార్డు వినియోగదారుల నుంచి కొట్టేసిన డబ్బుతో.. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసి.. వాటిని తిరిగి 55 శాతం ధరకు విక్రయిస్తూ ఆముఠా సొమ్ము చేసుకుంటోంది.