CV Anand: చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల్లో తెలిసిన వ్యక్తులే నిందితులుగా ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కుటుంబ పరువును దృష్టిలో ఉంచుకొని లైంగిక దాడుల విషయాలను గోప్యంగా ఉంచుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేయడానికి వీలవుతుందని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడుల నియంత్రణ కోసం భరోసా కేంద్రాలు ఎంతో కష్టపడుతున్నాయని సీపీ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులు... నేరాలు, మాదక ద్రవ్యాల విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని సూచించారు. భరోసా కేంద్రం అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య ప్రారంభించారు.