పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఉద్యోగ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జాబ్ కనెక్ట్(job connect పేరుతో పోలీసుల ఆధ్వర్యంలో అమీర్‌పేట్‌లో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను(job mela) ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 22 కంపెనీలు దాదాపు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత ఆరేళ్లుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని హాజరైన అభ్యర్థులకు అంజనీ కుమార్ సూచించారు. పశ్చిమ మండలంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 5 వేల మంది నిరుద్యోగులు మేళాకు హాజరయ్యారు.