నారాయణగూడకు చెందిన మద్ది జాహ్నవి 2017-18 విద్యా సంవత్సరంలో మదీనా మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఏఎన్‌బీసీ)లో చేరింది. రెండో సంవత్సరానికి అర్హత సాధించిన సమయంలోనే బీపీటీ కోర్సుకు ఎంపికైంది. ఆ కోర్సులో చేరేందుకు తన అసలు ధ్రువపత్రాలు ఇవ్వాలని కళాశాల సిబ్బందిని కోరింది. బీఎస్సీ రెండో సంవత్సరం మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని వారు చెప్పారు. దీంతో రూ.24,535 చెల్లించింది.
నిబంధనలకు విరుద్ధం కాదా..
ఈమేరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది. చెల్లించిన ఫీజుకు కనీసం రశీదు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. యూజీసీ నిబంధనల ప్రకారమే ఫీజు వసూలు చేశామని మదీనా కళాశాల జిల్లా కమిషన్‌కు రాతపూర్వక వివరణ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), వివిధ విశ్వవిద్యాలయాలు జారీ చేసిన నిబంధనలు పరిశీలించిన జిల్లా కమిషన్-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు ఆ కళాశాల తీరుపై మండిపడ్డారు. కళాశాల పేర్కొన్న నిబంధనలు సెమిస్టర్ పద్ధతి, లేదా ప్రస్తుత సంవత్సరం చదువుతున్నవారికి వర్తిస్తాయన్నారు. అసలు ధ్రువపత్రాలు కళాశాలలు తీసుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు.
జాహ్నవి చెల్లించిన రూ.24,535తో పాటు పరిహారంగా రూ.10 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని కళాశాలను ఆదేశించారు.
ఇవీచూడండి:బైడెన్, కమలా.. సీక్రెట్ కోడ్ పేర్లు ఇవే..!