వినియోగదారు ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్వవహరించిన ఐసీఐసీఐ బ్యాంకుపై జిల్లా వినియోగదారుల ఫోరం మండిపడింది. పరిహారంగా 50వేలు చెల్లించాలని ఆదేశించింది. బంజారాహిల్స్‌కు చెందిన ఎ.రాకేశ్‌రెడ్డి 2007 నవంబర్‌లో ప్రతివాద ఐసీఐసీఐ బ్యాంకులో గృహరుణం 17.36లక్షలు తీసుకున్నారు. ఏటా 10.50శాతం వడ్డీగా చెల్లించాలని నిర్ణయించారు.
ఐసీసీఐ బ్యాంకు
నిబంధనల ప్రకారమే ఈఎంఐలు కడుతున్న రాకేశ్ 2017లో తనకు స్టేట్మెట్ ఇవ్వాలని బ్యాంకును కోరారు. స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం గమనిస్తే.. వడ్డీ 12.60 శాతంగా ఉండటం గమనించి నివ్వెరపోయిన రాకేశ్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. వారు పెద్దగా స్పందించకపోవడం వల్ల 2017 సెప్టెంబర్‌లో లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈఎంఐను రివైజ్ చేయాలని కోరారు. దీనికి ప్రతివాద బ్యాంకు సిబ్బంది పెద్దగా స్పందించలేదు. తన దృష్టికి తీసుకురాకుండా వడ్డీ రేటును పెంచారని... దీనితో ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టాల్సి వచ్చిందంటూ రాకేశ్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదును ఖండించిన బ్యాంకు.. ఫోరానికి రాతపూర్యక వివరణ అందించింది. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికను రాకేశ్ ఎంచుకున్నారని ఇందుకు సంబంధించి సంతకం చేశారని తెలిపింది. నిబంధనల ప్రకారం వడ్డీ మార్పు జరగుతుందని స్పష్టం చేసింది. ప్రతివాద బ్యాంకు వాదనలతో ఏకీభవించని జిల్లా వినియోగదారుల ఫోరం 50వేలు పరిహారం చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణ ఈఎంఐను మార్చాలని సూచించింది. ముప్పై రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది.
సారథ్యం టెల్ బ్రాడ్ బ్యాండ్ సంస్థ
మలక్‌పేటకు చెందిన మహ్మద్ ఆర్షద్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఎక్స్టెల్ బ్రాడ్ బ్యాండ్ సంస్థను సంప్రదించి... 3,180 రూపాయలు చెల్లించారు. ఒకరోజు వ్యవధిలో కనెక్షన్లు ఇస్తామని తెలిపి మాట తప్పారు. పలుమార్లు ఇదే విషయమై విన్నవించుకున్నా... ప్రతివాదులు స్పందించలేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరినా పట్టించుకోలేదు. దీనితో సేవల్లో లోపం కలిగించారంటూ.. ఆర్షద్ జిల్లా వినియోగదారుల ఫోరాని సంప్రదించారు. ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించని ఫోరం-2 బెంచ్ కనెక్షన్ డబ్బు 3180, 9శాతం వడ్డీతో చెల్లించాలని ప్రతివాద సంస్థను ఆదేశించింది. పరిహారంగా 10వేలు చెల్లించాలని ఎక్స్టెల్ సంస్థను ఆదేశించింది.
చోళమండల బీమా
మహబూబ్‌నగర్‌కు చెందిన ఎర్రమల్లయ్య డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో కడప జిల్లా దువ్వూరు మండలం టంగుటూరు మిట్ట వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. దీనితో వాహనంలో ఉన్న మల్లయ్యతో పాటు అతని స్నేహితులు, డ్రైవరు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించగా డ్రైవర్ వెంకటేశ్ , స్నేహితుడు సురేందర్ గౌడ్, శ్రీనులు మృతి చెందారు. మరో స్నేహితుడు ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయ్యింది. దీనితో ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు చూపుతూ బీమా డబ్బులు చెల్లించాలని మల్లయ్య చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించారు. అయితే ఎటువంటి కారణాలు తెలపకుండానే బీమా కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. పలుమార్లు కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జిల్లా ఫోరాన్ని ఆశ్రయించారు. అయితే ఫిర్యాదుదారు వాదనలను బీమా కంపెనీ కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఫోరానికి రాతపూర్వక వివరణ అందించింది. ఇరువురి వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన ఫోరం 2.. బీమా కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుకు 9శాతం వడ్డీతో సహా 2.17లక్షలు చెల్లించాలని, 25 వేలు పరిహారంగా, ఖర్చుల కింద మరో 5వేలు ముప్పై రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో 12శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదీ చూడండి:బ్రెడ్ వ్యాపారి సైకిల్‌పై మోదీ 'జనతా' స్వరం!