KTR Release Hyderabad City Biodiversity Index: హైదరాబాద్ నగర జీవవైవిద్య సూచీ విడుదలైంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నివేదిక విడుదల చేశారు. జీవవైవిధ్యంలో పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిన మహానగరం.. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల సంరక్షణ వంటి కార్యక్రమాలతో జీవవైవిధ్యానికి బాసటగా నిలించింది.
తాజా పరిస్థితులకు అనుగుణంగా జీవవైవిధ్యాన్ని దేశంలో రెండోసారి మదింపు చేసిన ఏకైక నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిన నేపథ్యంలో జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను తిరిగి రెండోసారి రూపొందించిన తాజా నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది.
నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధి కోసం ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. నగర జీవవైవిధ్య సూచీ వల్ల ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రయత్నాలు విస్తృతంగా సాగుతున్నారు. ఈ రంగంలో స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు వంటి మెత్తం 23 రకాల అంశాలను కొలమానంగా తీసుకొని ఈ సూచీ రూపొందింది.
బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధి: మొత్తం 23 అంశాలకుగానూ అత్యధికంగా 92 మార్కులు కేటాయించడం జరుగుతుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 92 మార్కులకుగానూ 57 మార్కులు సాధించింది. అయితే 2012లో నగరంలో అప్పుడు జరిపిన బయోడైవర్సిటీ ఇండెక్స్ అధ్యయనంలో కేవలం 36 మార్కులు మాత్రమే లభించాయి. గత 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో జీవవైవిధ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధిని సాధించింది.
జీవించు-జీవించనివ్వు:నగరం కోసం ప్రత్యేకంగా జీవవైవిధ్య సూచీ నివేదిక తయారు చేసిన అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఒక నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా మారే పరిణామ క్రమంలో జీవవైవిధ్యం అత్యంత కీలకమైన అంశమని అన్నారు. జీవించు-జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.