Hyderabad CCTV Cameras Fail To Meet Expectations :హైదరాబాద్‌ను శాంతిభద్రతల పరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టింది సీసీ కెమెరాలంటే అతిశయోక్తి కాదు. నేరాలు జరిగిన గంటల వ్యవధిలోనే చేధించినవి కోకొల్లలు. అంతరాష్ట్ర దొంగల ముఠాలను ఆటకట్టించడంలోనూ సీసీటీవీ ఫుటేజ్‌లో లభించే సమాచారమే ఆధారం. చాలా కేసుల్లో దోషులకు శిక్షలు పడుతున్నాయనేందుకు నిఘా నేత్రాలే ఆధారాలు. విస్తరిస్తున్న జనావాసాలు పెచ్చుమీరుతున్న నేరాల కట్టడికి సమున్నత లక్ష్యంతో చేపట్టిన నేనుసైతం ద్వారా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు మసకబారుతున్నట్టు పోలీసులే అంగీకరిస్తున్నారు.
Government Awareness Programs on CCTV : ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడు జోన్లలో మొత్తం 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 36 ఏళ్ల తరువాత నగర కమిషనరేట్ పునర్విభజనతో 11 ఠాణాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. సిబ్బంది కొరత వల్ల శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతున్నారు. మూడేళ్లుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎమ్మెల్యే, ఎంపీ నిధులు, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, నేనుసైతం వంటి కార్యక్రమాలతో సీసీ టీవీకెమెరాలపై విస్తృత అవగాహన కల్పించారు. అపార్ట్‌మెంట్లు, దుకాణదారులు, వ్యాపారులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, కొందరు వ్యక్తిగతంగా వేలాది కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. భాగ్యనగరంలో సుమారు 7 నుంచి 8 లక్షలు అందుబాటులో వచ్చినట్టు అంచనా.
టమాటా పంటకు సీసీ కెమెరాలతో రక్షణ.. చోరీ భయంతో రైతుల జాగ్రత్తలు
నాణ్యతలోపం, రాత్రిళ్లు పనిచేయగల సామర్థ్యం లేకపోవటం, ప్రకృతి వైపరీత్యాలతో తరుచూ మరమ్మత్తుకు గురవుతున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య తలెత్తే గొడవలతో కేబుళ్లను తొలగించడం సమస్యగా మారింది. ప్రస్తుతం కాలంలో మరింత సాంకేతికతో కూడిన సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నా నాణ్యతలోపమైన వాటిని వాడటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్వాహకులను గుర్తించి వారితో మాట్లాడి వాటిని తిరిగి గాడిన పెట్టేందుకు రోజుల సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.