Viveka Murder Case Update: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించింది.ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్ కేటాయించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరి, శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ బదిలీ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్.షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను.. 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి తరలించారు.
సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాష్‌రెడ్డి : మరోవైపు వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం విచారణ కొనసాగుతోంది. తొలిసారి అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరైనారు. ఇప్పటికే సీబీఐ అధికారులు 248 మంది వాంగ్మూలం సేకరించారు. అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి రావడంతో ఆయన అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ న్యాయవాదిని సీబీఐ అధికారులు లోపలికి అనుమతించలేదు.
సీఆర్పీసీ 160 సెక్షన్ కింద అవినాష్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్‌రెడ్డి విచారణకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దర్యాప్తు అధికారి రాంసింగ్ పేరుతో ఈ నెల 24న ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.
ఇవీ చదవండి: