తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్చి 10కి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

YS Viveka murder case update : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇవాళ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. కేసును వచ్చే నెల 10కి వాయిదా వేసింది.

YS Viveka murder case
YS Viveka murder case

By

Published : Feb 10, 2023, 12:38 PM IST

YS Viveka murder case update : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఉమాశంకర్‌రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయినందున మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది.

YS Viveka murder case latest news : ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్‌ కేటాయించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 10 (నేడు)న విచారణకు రావాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి ఇప్పటికే తీసుకొచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details