చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో 1984లో 15 స్టాళ్లతో ప్రస్థానం ప్రారంభించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేడు 330 స్టాళ్లకు అభివృద్ధి చెందింది. ఏటా ఎంతో ఘనంగా జరిగే పుస్తక ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి గవర్నర్ తమిళిసై సోమవారం ప్రారంభించారు. జనవరి 1 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ కొనసాగనుంది. భిన్న భాషలు, దేశ, విదేశీ పబ్లికేషన్ల పుస్తకాలు లభ్యం కానున్నాయి.
సాంకేతికత ఆధారిత ఈ-పుస్తకాలు
బాలలు, యువత, వృద్ధులు, మహిళలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికోసం... ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, కథలు, నవలలు, ఆయుర్వేదం, సంస్కృతి, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు ఇలా అన్ని రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉంచారు. పుస్తకాలతోపాటు.. ఆధునిక సాంకేతికత ఆధారిత ఈ-పుస్తకాలు, సీడీలు, ఈ-లెర్నింగ్ మెటీరియల్ కోసం స్టాళ్లు సైతం ఏర్పాటయ్యాయి.
పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి
చరవాణి, కంప్యూటర్ ఏదీ కూడా పుస్తక స్థానాన్ని భర్తీ చేయలేదని.. పుస్తకం అందించే జ్ఞానం, ఆత్మవిశ్వాసం చాలా శక్తివంతమైనదని వక్తలు అభిప్రాయపడ్డారు. పిల్లలు, యువతలో పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.