జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. రహదారులపై ఇసుక, కంకర మేట వేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లను బల్దియా అధికారులు గాలికొదిలేయడం వల్లే ఈ దురవస్థ. హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్ కూడలి వద్ద శుక్రవారం సినీనటుడు సాయిధరమ్‌తేజ్ ప్రమాదం బారిన పడిన తీరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రూ.200 కోట్లతో నిర్మించిన తీగల వంతెన, రూ.130కోట్లతో చక్కదిద్దిన మైండ్‌స్పేస్ కూడలి, రూ.160కోట్లతో అభివృద్ధి చేసిన మైండ్‌స్పేస్‌కూడళ్ల మధ్యనున్న రోడ్లపైనే ఇసుక, కంకర వ్యర్థాలు పేరుకుపోతున్నాయంటే.. ఇతర ప్రాంతాల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.
కార్పొరేటర్లు వద్దన్నారని..
జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం రహదారులను ధ్వంసం చేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులకు జరిమానా విధించవచ్చు. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో ఇసుక, కంకర, కట్టెలు, రేకులు, ఇనుప కడ్డీలను ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు జరిమానా వేయొచ్చు. మూడోసారీ ఉల్లంఘనకు పాల్పడితే.. ఆ నిర్మాణాన్ని సీజ్ చేసే అధికారం ఉంది. అందుకోసం 400 మంది సిబ్బందితో రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొంతకాలం ఆ విభాగం నగరవ్యాప్తంగా తిరుగుతూ చాలా మందికి జరిమానా విధించింది. ఫిబ్రవరి 8, 2020న జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బడా నిర్మాణదారుల ఉల్లంఘనలను పట్టించుకోకుండా, బస్తీల్లో జరిగే నిర్మాణ పనుల వద్ద జరిమానాలు వేస్తున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే.. అప్పట్నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జరిమానాలు విధించడం మానేసింది. మూతలేని ట్రాలీల్లో బండరాళ్లను తరలించే టిప్పర్లనూ అధికారులు అడ్డుకోవట్లేదు.