Hyderabad as Robo Hub : మానవ వనరుల కొరతతో అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో రోబోల వాడకం భారీగా పెరుగుతోంది. దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ దేశాల్లోనూ రోబోలను ఎప్పటి నుంచో వాడుతున్నారు. మన దేశంలోనూ రోబో రంగంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. దీంతో రోబోల ఆవిష్కరణలకు, మార్కెటింగ్‌కు రాబోయే కాలంలో భారీగా అవకాశాలు ఉన్నాయని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్ట్-2022 పేరిట "ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్" ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Telangana Robotics Innovation Centre in Hyderabad : సాంకేతిక రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ సర్కార్ రోబోటిక్స్‌పై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ‘రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్’ పేరిట కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. రాబోయే తరాలను రోబోటిక్స్‌లో నిపుణులుగా తయారు చేసేందుకు విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. స్కూల్ దశ నుంచే రోబోటిక్స్ పైనా అవగాహన పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది.
TRIC as T hub in Hyderabad : రాష్ట్రంలో ప్రస్తుతం రోబోటిక్స్‌పై పనిచేస్తున్న సంస్థలు 1,200 నుంచి 1,500 వరకు ఉన్నట్లు అంచనా. ఈ రంగంలో ప్రస్తుతం వీటిపైన పనిచేసే నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పటికే చిన్న రోబోటిక్స్ సంస్థలు నిర్వహిస్తున్న వారికి అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమూ అంతంతమాత్రంగానే ఉంది. మార్కెటింగ్, సాంకేతికత కూడా నామమాత్రంగానే అందుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి టీ-హబ్ తరహాలో రోబోటిక్స్‌కు కూడా కేంద్రీకృత వ్యవస్థ అవసరమని, అప్పుడే మరింత అభివృద్ది బాట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్(ట్రిక్)’ పేరిట ప్రత్యేక రోబోటిక్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది.
Telangana Robotics Innovation Centre in Telangana : ఆవిష్కరణల నుంచి మార్కెటింగ్ వరకు అనుసంధానకర్తలా వ్యవహరించే విధంగా ఈ సంస్థను తీసుకురాబోతుంది. దీనిలో భాగంగానే టీ-హబ్, డబ్ల్యూఇ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, టీఎస్‌ఐసీ, ఆర్‌ఐసీహెచ్ సంస్థలను రోబోటిక్స్‌లో చేర్చనుంది. ఇటీవల దీనికి సంబంధించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక రంగం, వినియోగదారుల రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.