తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్​కే! - Olympics games

అంతర్జాతీయ క్రీడలకు భవిష్యత్​లో భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒలంపిక్ లేదా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం మనదేశానికి వస్తే హైదరాబాద్​ను భాగస్వామి చేయాలన్నది సర్కార్ ఆలోచన. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఆ క్రమంలోనే ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్... రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

hyderabad
hyderabad

By

Published : Feb 9, 2020, 9:38 PM IST

ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్​కే!

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకు అనుగుణంగా నగరంలో వివిధ ప్రాజెక్టులను చేపట్టిన సర్కార్... మౌలిక వసతుల రంగంపై ప్రధానంగా దృష్టి సారించింది. బ్రాండ్ హైదరాబాద్ పేరిట నగర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఆ దిశగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నగర వాసులకు వినోదం, ఉల్లాసాన్ని ఇచ్చేలా వివిధ రకాల ఈవెంట్స్​నూ నిర్వహిస్తోంది. ముఖ్యంగా పర్యటకులు, ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా పలు కార్యక్రమాలను చేపడుతోంది.

విశ్వక్రీడలపై దృష్టి

విశ్వనగరంగా రూపకల్పన చేస్తోన్న తరుణంలో విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. అంతర్జాతీయ స్థాయి క్రీడలను భాగ్యనగరంలో నిర్వహించే విషయమై ఆలోచనలను ప్రారంభించింది. హైదరాబాద్​కు ఉన్న అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని ధీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలన్న ఆలోచనలో సర్కార్ ఉంది. గతంలో నగరం వేదికగా జాతీయ క్రీడలతోపాటు ఆఫ్రో - ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. ప్రపంచ మిలటరీ క్రీడలకు కూడా భాగ్యనగరం ఆతిథ్యమిచ్చింది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడల నిర్వహణ విషయమై దృష్టి సారించింది.

ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు

భవిష్యత్​లో ఒలంపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం భారతదేశానికి దక్కితే హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశానికి ఆ అవకాశం లభిస్తే భాగ్యనగరానికి ఆ అవకాశం దక్కించుకునేలా ప్రయత్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన క్రీడల అనుభవం, అందుబాటులో ఉన్న వసతులు తదితర అంశాలను పరిశీలిస్తే క్రీడల నిర్వహణకు అన్ని రకాల అనుకూలతలు దేశ రాజధాని దిల్లీతోపాటు భాగ్యనగరానికి మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. అప్పటి వరకు నగరంలో పెరగనున్న మౌలిక వసతులు, నూతనంగా చేపట్టే ప్రాజెక్టులు పూర్తై క్రీడల నిర్వహణకు మార్గం సులువవుతుందని భావిస్తున్నారు.

2016లో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర బృందం

ఇప్పటి నుంచే ధీర్ఘకాలిక వ్యూహంతో ఓ క్రమ పద్ధతిన ముందుకెళ్తే భాగ్యనగరానికి అపూర్వ అవకాశం దక్కించుకోవచన్న ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2016 ఒలంపిక్ క్రీడల సమయంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లింది. రియో డీ జనిరో నగరంలో జరిగిన ఒలంపిక్ క్రీడల ఏర్పాట్లను అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతోపాటు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఎండీ దినకర్ బాబు పరిశీలించారు.

అందుకే జయేశ్​ రంజన్​ పోటీ

15 రోజుల పాటు అక్కడ పర్యటించిన రాష్ట్ర బృందం.. విశ్వక్రీడల నిర్వహణ ఏర్పాట్లను అధ్యయనం చేసింది. భవిష్యత్​లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఎన్నికల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్​ రంజన్ బరిలో దిగుతున్నట్లు చెప్తున్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూస్తోన్న జయేశ్​ రంజన్​ ఒలంపిక్ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details