లోక్సభ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలు చేపట్టేందుకు నిర్వహించిన పరీక్షలో కలెక్టర్లు పాసయ్యారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వాహణ ప్రణాళిక, శాంతిభద్రతలు, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు తదితర అంశాలపై వివరించారు.
కలెక్టర్లు పాసయ్యారు - ఎన్నికలు
కలెక్టర్లు పాసయ్యారు.... మీరు విన్నది నిజమే... లోక్సభ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణ పరీక్షలో వారు ఉత్తీర్ణులయ్యారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే పాలనాధికారులు నిర్ధేశిత పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. నాలుగు జిల్లాల కలెక్టర్లు శిక్షణ, పరీక్షకు హాజరు కాలేదు. హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలకు కలెక్టర్లు లేరు. వారిని నియమించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో ఉన్నారు. ఈ నెల 20, 21న దిల్లీలో జరగనున్న శిక్షణ పరీక్షకు వీరు హాజరు కావాల్సి ఉంటుంది.