ఈ నెల 28న తెలంగాణ మంత్రిమండలి భేటీ శాఖల సమూల ప్రక్షాళనే లక్ష్యం...
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి... ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 14తో పోలింగ్ ముగియనుంది. మొత్తంగా అన్ని ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత మంత్రిమండలి భేటీ నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల నుంచి సమాచారం కోరారు. ఆయా శాఖల సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ చట్టాల ముసాయిదాలను ఈ నెల మూడో వారంలోగా పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా బిల్లులను తయారు చేస్తారు. వాటిపై మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పలు పాలనాపరమైన అంశాలకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది.
శాసనసభ, మండలి సమావేశాలపైనా దృష్టి...
ఎన్నికల నియమావళి ముగుస్తున్నందున రైతుబంధు, ఆసరా, ఇతర పథకాల సాయం పెంపు వంటి వాటికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ రెండో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగాల భర్తీ, వివిధ నిర్మాణాలకు స్థలాల కేటాయింపు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి తేదీ ఖరారు కావడం వల్ల శాసనసభ, మండలి సమావేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడురోజుల పాటు శాసనసభ, మండలి సమావేశాలు జరిపే వీలుంది.
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై కీలక నిర్ణయం..
ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. 28న మంత్రిమండలి ముసాయిదాను ఆమోదించిన వెంటనే 29 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ రెండు చట్టాలపై చర్చించి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత వాటిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఇవీ చూడండి:పునరావాస ప్లాట్లు కొల్లగొడుతున్న కబ్జాదారులు