అధికారుల ఒత్తిడి, పత్రికల కథనాలతో పోలీస్ యంత్రాంగం మేలుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పరిధిలో అదృశ్య కేసులను 24 గంటల్లోనే ఛేదించారు.
ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం
అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు భయాందోళన చెందవద్దని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు అభయమిచ్చారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులెవరైనా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని తెలిపారు.
అదృశ్యమైన బాలికలు క్షేమం..!
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్ పుర గ్రామం సాయిబాబా కాలనీలోని చెరిష్ అండర్ ప్రేవిలైజ్ లైవ్స్ హోమ్‌కు చెందిన మిస్సింగ్ కేస్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఏడో తరగతి విద్యార్థిని మాయ, ఐదో తరగతి విద్యార్థిని పార్వతి (13), జయ (12), రాణి (13) ఈ నెల 8న బయటకి వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీసీఫుటేజ్ ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు... రెండు, మూడు బృందాలుగా విడిపోయి చిన్నారులకోసం గాలింపు చేపట్టారు. స్థానికుల సమాచారం, సీసీఫుటేజ్‌ల ఆధారంగా 24 గంటల్లోనే కేసును ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు లేటెస్ట్ లొకేషన్ ఫైండ్ యాప్స్, జీపీఎస్ గ్యాడ్జెట్స్‌ను వాడడం ఉత్తమమని సీపీ సూచించారు. తప్పిపోయిన వారు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444, రాచకొండ వాట్సాప్ నంబర్ 9490617111కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం