Eetela Rajender on University Professors Issue: మంత్రివర్గ ఏర్పాటు విషయంలో... బీసీ, షెడ్యూల్డ్ కులాల వారిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. 50 శాతం ఉన్న బీసీల నుంచి ముగ్గురికి మంత్రి పదవులు, 17 శాతం ఉన్న షెడ్యుల్డ్ కులాల వారి నుంచి ఒకరికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆ సమస్యను ప్రశ్నించే వారిపై కక్ష్య పెంచుకొని మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా భాస్కర్ ఆడిటోరియంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో 'వెనుకబడిన తరగతుల భవిష్యత్తు అభివృద్ధి' అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం మాట్లాడిన ఈటల తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈటెల మండిపడ్డారు. రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటులో వెనుకబడిన కులాలకు కేటాయిస్తున్న మంత్రి పదవుల విషయంపై మాట్లాడారు. బీసీ కులాలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కోసం కొట్లాడామని... కానీ, కొత్త విశ్వవిద్యాలయాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రైవేటు పరం చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు.